Site icon Bhakthi TV

15న అమరావతి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీనివాస కల్యాణం

అమరావతిలోని శ్రీవారి ఆలయంలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. శ్రీనివాస కళ్యాణం సందర్భంగా ఆయన అమరావతిలో టీటీడీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, 2018లో అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి హోదాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు 25 ఎకరాల స్థలం కేటాయించి 2019లో శంకుస్థాపన చేశారని తెలిపారు. 2022లో ఈ ఆలయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. శ్రీవారి వైభవాన్ని నాలుగు దిశల వ్యాప్తి చేసేందుకు టీటీడీ శ్రీవారి కళ్యాణం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ క్రమంలో అమరావతిలోని భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని కోరడంతో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టిందన్నారు.

మార్చి 15న టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 25వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి కల్యాణం వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులందరికీ తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు పంపిణీ చేనున్నట్లు తెలిపారు. భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్కీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ కార్యక్రమంపై ఇప్పటికే శ్రీవారి ధర్మ రథాలతో ప్రచారం చేస్తున్నామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్ లో ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలియజేశారు.

Share this post with your friends
Exit mobile version