
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి ప్రారంభమై నేటి పంచమి తీర్థంతో విజయవంతంగా జరిగాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ శ్యామల రావు తెలిపారు. ఇవాళ పంచమి తీర్థం అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నాక టీటీడీ ఈవో మాట్లాడుతూ లక్షలాది భక్తులు పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం చేశారన్నారు. 9 రోజుల పాటు నిరంతరం టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు.
అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వాహన సేవలు, క్యూలైన్లు ఏర్పాటు, ఇంజనీరింగ్ పనులు, ఆకట్టుకునే విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, భద్రత, పార్కింగ్ , విస్తృతంగా అన్నప్రసాదాలు , తాగునీరు, బాదం పాలు, వైద్య , ఆరోగ్య సేవలు అందించామన్నారు. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకుని క్షేత్ర స్థాయిలో అమలు చేశామన్నారు. పంచమి తీర్థం సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. వేయి మంది శ్రీవారి సేవకులు విస్తృత సేవలు అందించారని ఈ సందర్భంగా అభినందించారు. జిల్లా అధికారులు, పంచాయతీ అధికారులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవాలను విస్తృతంగా ప్రచారం చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులను, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలను అందించిన ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు.
