
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాహన సేవల బుక్ లెట్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె.శ్యామలరావు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 13వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందన్నారు. ఫిబ్రవరి 17న అంకురార్పణ నిర్వహిస్తారని చెప్పారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఫిబ్రవరి 18న ధ్వజారోహణం, 22న గరుడ వాహనం, 23న సాయంత్రం స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయన్నారు. వాహన సేవలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
