Site icon Bhakthi TV

కల్పవృక్ష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం ఉదయం గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 గంటల నుండి వాహనసేవ వైభవంగా సాగింది. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్ఠిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం.

ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్రమథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు ఈడేర్చే కోనేటిరాయుడు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. అనంతరం ఉదయం 10.00 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.00 వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది.

Share this post with your friends
Exit mobile version