Site icon Bhakthi TV

స‌హ‌స్రా శీర్ష పురుషునికి ప్ర‌త్యేక స‌హ‌స్ర‌క‌ల‌శాభిషేకం

శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ రోజును పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ ఆదివారం నాడు వైభవంగా ఏకాంతంగా నిర్వహించింది. ఇందులో బాగంగా ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు.

శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళపెరుమాళ్ ను, అయ‌న‌కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆశీసునులు చేశారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేశారు. అన‌గా శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి నిర్వ‌హించే అభిషేకాధి క్ర‌తువులు మూల‌మూర్తికి నిర్వ‌హించిన‌ట్లు అవుతుంది. అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు ఏకాంతంగా ప్ర‌త్యేక సహస్రకలశాభిషేకం వైభ‌వంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా జ‌రుగుతాయి.

Share this post with your friends
Exit mobile version