
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. గోడ పత్రికలను టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆలయంలో అన్ని ఏర్పాట్లూ చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 06 నుండి 15వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ రెండు ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై 05వ తేదీ అంకురార్పణ జరుగనుంది.
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వాహనసేవలు :
జూలై 06న ఉదయం 6.16 గం.లకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 6 గం.లకు హంసవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. జూలై 10న ఉదయం పల్లకీ సేవ రాత్రికి నంది వాహనం జరుగనుంది. జూలై 11న సాయంత్రం 06.00 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. ఆ తరువాత రాత్రి 07.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 12న సాయంత్రం పల్లకీ సేవ, జూలై 13న సాయంత్రం 06.00 గంటలకు పార్వేట ఉత్సవం, జూలై 14న ఉదయం 10.00 – 12 గం.ల మధ్య వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జూలై 15వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 06 – 08 గం.ల మధ్య పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
