Site icon Bhakthi TV

భక్తుల కోసం షిర్డీ సాయిబాబా సంస్థాన్ కీలక నిర్ణయం

మహా రాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా షిర్డీ విలసిల్లుతోంది. దేశ వ్యాప్తంగా భక్తులు షిర్డీ సాయినాథుని దర్శించుకునేందుకు ఇక్కడకు వస్తుంటారు. భక్తుల సంక్షేమం కోసం తాజాగా షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడి నుంచి అయినా సరే.. సాయిబాబా దర్శనానికి వచ్చే భక్తుడికి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ ఉచిత భీమా సౌకర్యం అనేది బాబాను దర్శనానికి వెళుతున్న సమయంలో లేదంటే దర్శనం చేసుకుని తిరిగి స్వస్థలానికి వెళుతున్న సమయంలో అనుకోని ప్రమాదం భక్తుడికి వాటిల్లితే ఈ బీమాను అందజేస్తారు.

షిర్డీ సాయిబాబా దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఒక్కో భక్తుడికి రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించనున్నట్లు సాయిబాబా సంస్థాన్‌ సీఈవో వెల్లడించారు. అయితే దీనికి ఒక కండీషన్ పెట్టారు. భక్తులు సాయిబాబా దర్శనం, భక్త నివాస్‌, అభిషేకం, మిగతా పూజ కార్యక్రమాల కోసం అధికారిక వెబ్‌సైట్లలో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి మాత్రమే ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని సాయిబాబా సంస్థాన్ స్పష్టం చేసింది. దీనికోసం భక్తులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. సుమారు 10 లక్షల మంది భక్తులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ మేరకు బీమా కంపెనీకి రూ.48 లక్షలు చెల్లించి ఈ పథకాన్ని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చారు. ఇకపై షిర్డీ సాయి దర్శనానికి వెళ్లే భక్తులు బీమా సౌకర్యం కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version