
భారతదేశంలో ప్రతి పన్నెండేళ్లకోసారి పుణ్యనదులకు పుష్కరాలు వస్తుంటాయి. అయితే పుష్కరాలు వచ్చినప్పుడు ఏడాది కాలం పాటు ఉంటాయి. కానీ ఆది, అంత్య పుష్కరాల పేరిట మనం తొలి 12 రోజులను పవిత్రమైనవిగా భావిస్తాం. ఈ ఏడాది సరస్వతి నదికి పుష్కరాలు వచ్చేశాయి. నేటి నుంచే సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అసలు పుష్కరం అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. పూర్వ కాలంలో పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుని కోసం కఠోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోవాలని అడిగాడట.
దానికి పుష్కరుడు జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయని.. కాబట్టి నదులు పునీతం అవ్వాలని తెలిపాడు. అలా నదులు పునీతమైతేనే ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారని కాబ్టటి తన శరీర స్పర్శతో నదులు పునీతమయ్యేలా వరం ఇవ్వమని శివుడిని అర్థించాడట. అప్పుడు శివుడు.. నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థంగా మారుతుందని వరం ఇచ్చాడట. అలాగే ఆ సమయంలో నదిలో స్నానమాచరించిన వారంతా పాప విముక్తులవుతారని పుష్కరుడికి శివుడు వరమిచ్చాడట. అప్పటి నుంచి పుష్కరుడు ప్రతి 12 ఏళ్లకోసారి ఓ నదిని ఆవహిస్తున్నాడు.
