Site icon Bhakthi TV

16 నుంచి టీటీడీ పాఠశాలల్లో ‘సద్గమయ’

తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలల్లో ఈ నెల 16 నుండి 19 తేదీ వరకు సద్గమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు తెలిపారు. టీటీడీ ఈవో ఛాంబర్‌లో టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంతో కలసి సోమవారం హెచ్‌డీపీపీ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. టీటీడీకి చెందిన 7 పాఠశాలలలో టీటీడీ విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా, సరళమైన పదజాలంతో బోధించాలని సూచించారు. శ్రీవారి వైభవాన్ని యువత, పిల్లలకు మరింతగా తెలిసేలా శిక్షణ ఉండాలన్నారు.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానములు సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు , సనాతన ధర్మం విలువలను పిల్లలలో తొలిదశలోనే అలవాటు చేసినట్లు అయితే తమ జీవనాన్ని ధర్మబద్ధంగా విలువతో కూడిన జీవనాన్ని నేర్పినట్లు అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బాలబాలికలకు చిన్న వయసు నుండే సనాతన ధర్మం, ఉమ్మడి కుటుంబం, తల్లి, తండ్రి, గురువు, దైవము, సమాజం, దేశం గొప్పతనాన్ని తెలియజేసే అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు.

టీటీడీకి చెందిన 7,8,9 తరగతుల పిల్లలకు తిరుపతిలోని ఎస్.జీ.ఎస్. హైస్కూల్, ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, ఎస్వీ హైస్కూల్, ఎస్.కె.ఆర్.ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ , ఎస్పీ బాలికల పాఠశాల, తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తాటితోపులోని ఎస్.కె.ఎస్. హైస్కూల్ పిల్లలకు ఆయా పాఠశాలలలో సదరు తేదీలలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు అవసరమైన ‘సద్గమయ’ మాడ్యూల్, లిటరేచర్ పుస్తకాలు అందించాలన్నారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ తదితర ప్రాజెక్ట్ లలో జరుగుతున్న కార్యక్రమాలను, అంతకుముందు స్విమ్స్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధింత అధికారులతో టిటిడి ఈవో సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Share this post with your friends
Exit mobile version