Site icon Bhakthi TV

తిరుమలలో క్రీ.శ 1564 నుంచి రథసప్తమి..

సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుంచి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరానికి చెందిన విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Share this post with your friends
Exit mobile version