Site icon Bhakthi TV

శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్యాణ వేదికను సైతం అధికారులు సిద్ధం చేశారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రవాణా, మెడికల్ వంటి సదుపాయాలన్నింటినీ అందుబాటులో ఉంచారు. అయితే స్వామివారి కల్యాణం కోసం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు శ్రీ కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను గురువారం సమర్పించారు.

మొత్తం 120 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద సూపరింటెండెంట్‌ శ్రీ హనుమంతయ్య, అర్చకులు శ్రీ శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు. ఈ తలంబ్రాల కోసం మూడు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో మూడు నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 14 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, మూడు ఏళ్లుగా అయోధ్యకి, 8 ఏళ్లుగా ఒంటిమిట్ట రామునికి కల్యాణోత్సవం సందర్భంగా అందజేస్తున్నామని శ్రీ కళ్యాణ అప్పారావు తెలిపారు.

Share this post with your friends
Exit mobile version