Site icon Bhakthi TV

కావడి యాత్రలో పెను ప్రమాదం.. 18 మంది మృతి

శ్రావణమాసంలో ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున శివ భక్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో కావడి యాత్ర నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ కావడి యాత్రలో నేటి (మంగళవారం) ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది. కావడి యాత్రికులతో వెళుతున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో 18 మంది మరణించారు. ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవఘర్‌లో మంగళవారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

కావడి యాత్రికులు కొందరు బాబా ధామ్ (దేవఘర్) నుంచి బాసుకీనాథ్ వైపుగా బస్సులో పయనమయ్యారు. బస్సు మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా ప్రాంతానికి చేరుకోగానే అటు వైపు నుంచి గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వస్తున్న ట్రక్కును ఢీకొనడమే పెను ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపుగా 18 మంది చనిపోయనట్లు స్థానిక బీజేపీ ఎంపీ నిశాంత్ దూబే వెల్లడించారు. ఈ విషయాన్ని ఎంపీ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

Share this post with your friends
Exit mobile version