Site icon Bhakthi TV

5 నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం చెప్పారు. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో జరుగుతున్న జీర్ణోదరణ మరమ్మత్తు పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం జేఈవో అధికారులతో ఒంటిమిట్టలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం గత ఏడాది సెప్టెంబరు 6 నుండి 8వ తేదీ వరకు ”బాలాలయం” నిర్వహించినట్లు తెలిపారు. భారత పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సకాలంలో ఆలయ పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని టీటీడీ అధికారులను కోరారు.

మార్చి 5 నుండి 9వ తేదీ వరకు ఆలయంలో మహా సంప్రోక్షణ నిర్వహించి, భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించనున్నట్లు తెలియజేశారు. కడప జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం త్వరలో జిల్లా అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. ఒంటిమిట్ట ఆలయ పునరుద్ధరణ పనులు, ఏప్రిల్ నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని వేసవి నేపథ్యంలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం జేఈవో ఆలయంలో జరుగుతున్న మరమ్మత్తు పనులు, కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.

Share this post with your friends
Exit mobile version