Site icon Bhakthi TV

తిరుమలలో తనకు ఇష్టమైన హనుమంతునిపై ఊరేగిన శ్రీరాముడు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారంనాడు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఆదివారం సాయంత్రం తిరుమలలో హనుమంత వాహన సేవ జరిగింది. శ్రీరాముడు తనకు ఇష్టమైన హనుమంత వాహనంపై స్వర్గారోహణం చేసి నాలుగు మాడ వీధుల్లో భక్తులను ఆశీర్వదించాడు. అనంతరం రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు. అదేవిధంగా ఏప్రిల్ 7వ తేది శ్రీరామ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు.

Share this post with your friends
Exit mobile version