Site icon Bhakthi TV

8న పద్మావతి అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేయనుంది. ఈ క్రమంలోనే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు(ఇద్దరు) రూ.1000/- చెల్లించి పాల్గొనవచ్చు.

ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయనుంది. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయనున్నారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచింది. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో మరింత ఆకర్షిణీయంగా, ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టనుంది.

Share this post with your friends
Exit mobile version