Site icon Bhakthi TV

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘ‌నంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల‌ వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మ‌ధ్యాహ్నం 3 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీధర్ భట్టాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 18వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version