
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారిలో ఆలయంలో మార్చి 25వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ వరకు శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే రేపు స్వామివారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా మార్చి 25న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
