Site icon Bhakthi TV

రథంపై ఒంటిమిట్టలో విహరించిన శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం వాహన సేవలు, ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు.

అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో శ్రీ‌ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు, పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version