Site icon Bhakthi TV

పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో నేడు అంకురార్పణ, విశ్వక్సేన పూజ జరగనుంది.వీటి విశిష్టతను తెలుసుకుందాం. తిరుమల శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి కూడా ప్రతి ఏటా పెద్ద ఎత్తున కార్తిక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అమ్మవారు కార్తీకమాసంలో జన్మించిందని అందుకే ప్రతి ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఈ క్రమంలోనే నేడు అంకురార్పణ నిర్వహించనున్నారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉద్యానవనంలో పుట్టమన్నును సేకరించి సాయంత్రం శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకొచ్చి నవ ధాన్యాలను పుట్ట మన్నులో వేసి అంకురార్ఫణకు శ్రీకారం చుడతారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. అంకురార్పణలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. సస్యకారక అంటే పంటలు పండించే వాడని అర్థం. ఈ కారణంగా పగటివేళ కాకుండా సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. విత్తనాలను నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. ఆలయ ప్రాంగంణంలో ఉన్న యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Share this post with your friends
Exit mobile version