Site icon Bhakthi TV

శ్రీశైలంలో శాస్త్రోక్తంగా కామ దహన వేడుకలు

దేశమంతటా హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. నేడు కామ దహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్ధశిని పురస్కరించుకుని కామదహన కార్యక్రమాన్ని శాస్త్రోక్తకంగా నిర్వహించారు. శ్రీగిరులపై ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థానం అధికారులు పాల్గొని కామదహనం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా.. మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మీదట ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రాంగణంలోని మనోహరగుండం దగ్గర విశేష పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా గంగాధర మండపం వరకు తీసుకెళ్లారు.

శ్రీశైలం ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం దగ్గర కామ దహన కార్యక్రమాన్ని చేపట్టారు. శాస్త్రోక్తకంగా గడ్డితో చేసిన మన్మథ రూపాన్ని దహనం చేశారు. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కామదహన కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఫాల్గుణ మాసంలో శుద్ధ చతుర్ధశి రోజున జరిగే కామదహన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శివకటాక్షం లభిస్తుందని వేద పండితులు తెలిపారు. ఈ కామదహనం వెనుక ఒక కథ ఉంది. శివుడి తపస్సును మన్మధుడు భగ్నం చేశాడట. దీంతో పరమేశ్వరుడికి పట్టరాని కోపం వచ్చి తన మూడో కన్ను తెరిచి మన్మథుడిని దహనం చేశాడట. ఇది ఫాల్గుణ చతుర్థశి రోజునే జరిగిందని.. అప్పటి నుంచి కామ దహన వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని వేదపండితులు తెలిపారు.

Share this post with your friends
Exit mobile version