Site icon Bhakthi TV

హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు.

సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై..

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి

హంస వాహనసేవలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version