
దసరా ఉత్సవాలు అనగానే మనకు గుర్తొచ్చేది మైసూరే. ఇక్కడి దసరా ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ నిర్వహించే దసరా జంబూ సవారీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. నిన్న దసరా పండుగ సందర్భంగా మైసూరు దసరా జంబూ సవారీ అత్యంత వైభవంగా సాగింది. నలభై ఏళ్ల వయసున్న గజరాజు అభిమన్యు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. అభిమన్యుపై ముందుగా 750 కేజీల బరువున్న బంగారు అంబారీని కట్టి దానిలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బంగారు ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో వందలాది మంది జానపద కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు.
అసలు మైసూర్‌లో ఈ జంబూ సవారి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యం సంస్కృతి, సంప్రదాయాలకు కొనసాగింపుగా శ్రీరంగనాథుడు కొలువైయున్న శ్రీరంగపట్నంలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయని చెబుతారు. 16వ శతాబ్దం తొలినాళ్లలో ఈ వేడుకలను వడయార్ రాజులు ప్రారంభించారట. అనంతరం మైసూర్‌లో 1885 నుంచి మూడో కృష్ణ రాజు వడియార్ హయాంలో ఈ వేడుకలు నిర్వహించడం ప్రారంభమైంది. అనంతరం దీనిని కర్ణాటక రాష్ట్ర పండుగగా నిర్వహించడం జరిగింది. అయితే ఏటా ఈ వేడుకలు చాముండి కొండలపై కొలువై ఉన్న చాముండేశ్వరి ఆలయం వద్ద ప్రారంభమవుతాయి.
