Site icon Bhakthi TV

పూర్వకాలంలో అమ్మవారికి దున్నపోతును బలిచ్చేవారట..

పూర్వకాలంలో బోనాల పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది.

అమ్మవారిని శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

Share this post with your friends
Exit mobile version