Site icon Bhakthi TV

తిరుమలలోని కుమారధారకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో కుమారతీర్త ముక్కోటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. ఒకరోజు ఆయన ఎదుట శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై.. ‘‘ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏం చేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు.

అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది. పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోక సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిని సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు శ్రీ కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.

Share this post with your friends
Exit mobile version