Site icon Bhakthi TV

24 నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్స‌వాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్ట్ 24 నుంచి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆగ‌స్టు 26వ తేదీ వ‌ర‌కు ఈ పవిత్రోత్సవాలు ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి. ఆగ‌స్టు 23న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా ఆగ‌స్టు 24వ‌ తేదీ ఉదయం చ‌తుష్టానార్చ‌న‌, ప‌విత్ర ప్ర‌తిష్ట‌, సాయంత్రం ప‌విత్ర‌హోమం, నివేద‌న‌, శాత్తుమొర జ‌రుగ‌నున్నాయి. ఆగ‌స్టు 25న ఉద‌యం ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 26న ఉద‌యం మ‌హా పూర్ణాహుతి, ప‌విత్ర విస‌ర్జ‌న‌, కుంభ‌ప్రోక్ష‌న, సాయంత్రం శ్రీ సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు బుధ‌వారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి. ఉదయం 5 గంట‌ల‌కు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మ‌వార్ల‌ మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, గ‌రుడాళ్వారుకు, ప‌రివార దేవ‌త‌ల‌కు పవిత్రమాలలు సమర్పించారు. సాయంత్రం 5.30 గంటలకు తిరువీధి ఉత్సవం, యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయి.

శ్రీల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆల‌యంలో ముగిసిన‌ బాలాల‌యం

దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో గ‌త మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న బాలాల‌యం కార్య‌క్ర‌మాలు బుధ‌వారం ఉద‌యం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉద‌యం 9.30 గంట‌లకు మ‌హాపూర్ణాహుతి, ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య తులా లగ్నంలో బాల బింబ‌ ప్ర‌తిష్ట‌, బాలాలయ సంప్రోక్షణ నిర్వహించారు.

Share this post with your friends
Exit mobile version