ఫ్రాన్స్ గడ్డపై భారతీయ ఆధ్యాత్మికతకు చారిత్రక వెలుగు కనిపిస్తోంది. పారిస్ సమీపంలోని బస్సీ–సెయింట్–జార్జెస్‌లో తొలి సంప్రదాయ హిందూ మందిర నిర్మాణానికి బీఏపీఎస్ వేసిన అడుగులు భక్తుల హృదయాలను తాకుతున్నాయి. భారత్ నుంచి తీసుకువచ్చిన తొలి శిలలు అక్కడికి చేరుకోవడం ఒక పవిత్ర ఘట్టంగా నిలిచింది. తరతరాల భారత శిల్పకళా సంప్రదాయంతో, శ్రద్ధగా చెక్కిన ప్రతి రాయి భగవంతుడి నామస్మరణను గుర్తుచేస్తోంది. ఈ మందిరం కేవలం ఆరాధన స్థలం మాత్రమే కాదు, భారత్–ఫ్రాన్స్ స్నేహానికి, సంస్కృతుల సంగమానికి ప్రతీకగా నిలవనుంది. భారత శిల్పులు, ఫ్రెంచ్ నైపుణ్యం కలసి రూపుదిద్దుకునే ఈ ఆలయం, భక్తి, సేవ, సామరస్యత విలువలను ప్రపంచానికి చాటుతుంది. మహంత్ స్వామి మహారాజ్ ఆశయాల ప్రకారం నిర్మితమవుతున్న ఈ మందిరం భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా వెలుగొందనుంది.

