
హైదరాబాద్ హిమయత్ నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం 20వ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. ఆహ్వాన పత్రికను, గోడ పత్రికలను చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మెన్ ఛాంబర్ లో బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ హైదరాబాద్ హిమయత్ నగర్‌లోని ఎస్వీ ఆలయంలో జూన్ 03వ తేదీ నుంచి 07వ తేదీ వరకు జరుగనున్నాయన్నారు.
వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీరు, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు తదితర ఏర్పాట్లను అధికారులు సమిష్టిగా, సమన్వయంతో చేపట్టాలని సూచించారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 06 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. జూన్ 3వ తేదీ ఉదయం 06.30 గంటల నుండి 8.45 గంటల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.
వాహన సేవల వివరాలు
జూన్ 03వ తేదీన ఉదయం 10 – 11 గంటల వరకు శేష వాహనం, రాత్రి 08.00 – 09.00 గంటల వరకు హనుమంత వాహనం
జూన్ 04వ తేదీన ఉదయం 8.30 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 08 గంటలకు చంద్రప్రభ వాహనం
జూన్ 05వ తేదీ ఉ. 8.30 గంటలకు గజ వాహనం, ఉదయం 10.30 గంటలకు శ్రీవారి శాంతి కల్యాణం, రాత్రి 08 గంటలకు గరుడ వాహనం
జూన్ 06వ తేదీ ఉ. 08.30 గంటలకు రథోత్సవం, రాత్రి 08 గంటలకు అశ్వ వాహనం
జూన్ 07వ తేదీ ఉదయం 11.30 గం.లకు చక్రస్నానం, సాయంత్రం 06 గం.లకు పుష్పయాగం, రాత్రి 09 గం.లకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాద వితరణ జరుగనుంది. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏఈవో శ్రీ యు.రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
