
మహాకుంభ మేళా జాతర ముగిసింది. అంచనాలను తలకిందులు చేసి మరీ భక్తులు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానమాచరించారు. ఇక త్వరలో చార్‌ధామ్ యాత్ర మొదలు కానుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి పవిత్ర క్షేత్రాల సందర్శనం కోసం చేసే యాత్రను చార్‌ధామ్ యాత్ర అని అంటారు. ఈ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని భక్తులు తపిస్తూ ఉంటారు. దీనికోసం భక్తులకు గుడ్ న్యూస్. ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభ తేదీలను అధికారులు ప్రకటించారు. ఈ సంవత్సరం మే నెలలో చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ ప్రసాద్ తప్లియాల్ ఆలయ తలుపులు తెరుచుకునే తేదీలతో పాటు యాత్ర ప్రారంభ తేదీలను ప్రకటించడం జరిగింది. మే 2న ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్‌తో పాటే బద్రీనాథ్, గంగోత్రి , యమునోత్రి ధామ్ ఆలయ తలుపులు తెరిచే తేదీలను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ శుభ సందర్భంగా గంగోత్రి , యమునోత్రి ద్వారాలు.. బద్రీనాథ్ మందిరం మే 4న తెరుచుకుంటుంది. తేదీలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో చార్ ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మే 1న ఆలయ తలుపులు తెరవడానికి ముందు, బాబా కేదార్‌నాథ్ పల్లకీని గౌరీకుండ్ నుంచి తీసుకుని కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటారు.
