
అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ఎంతో మంది భక్తులు అయోధ్య రామయ్య ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకోవాలని తపిస్తున్నారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత వెళదామని అంతా వేచి చూస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం పనులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం వచ్చేసింది. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. రామ దర్బార్‌లో ప్రతిష్టించాల్సిన దైవిక విగ్రహాలు అయితే చేరుకున్నాయి. వాటన్నింటినీ తొలి అంతస్థులో ప్రతిష్టిస్తారు. ముఖ్యంగా రామ దర్భార్ లో సీతాదేవి సమేత శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు కొలువు దీరనున్నారు.
ఇక ఈ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠకు సైతం ముహూర్తం ఖరారైంది. ఈ ప్రాణ ప్రతిష్టా మహోత్సవాలు జూన్ 3 న ప్రారంభమై జూన్ 5న ముగుస్తాయి. దీనికి ముందే ప్రధాన ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రాకారము, శేషావతార ఆలయం వంటి మిగిలిన నిర్మాణం పనులు మాత్రం మిగులుతాయి. వాటిని కూడా సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య పూర్తి చేస్తామని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. సప్త మందిర విభాగం నిర్మాణం అయితే ఇప్పటికే పూర్తి చేసి.. ఋషులు, సాధువుల విగ్రహాలను ప్రతిష్టించారు. ఆలయ మధ్యభాగంలో పుష్కరిణి కూడా పూర్తైంది. 2020లో నిర్ణయించిన నిర్మాణ ప్రణాళికలోని పనులన్నీ 2025 ఏడాది చివరినాటికి పూర్తి చేస్తామని నృపేంద్ర మిశ్రా తెలిపారు.
