
వైఎస్సార్ కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నేటి (మే 10) నుంచి పెద్ద ఎత్తున స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ తెప్పోత్సవాలు మూడు రోజుల పాటు అంటే నేటి నుంచి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆలయ పుష్కరిణిలో మూడు రోజుల పాటు సాయంత్రం వేళ తెప్పలపై విహరించనున్నారు. ఈ క్రమంలోనే దేవేరులతో కలిసి స్వామివారు నేడు తెప్పలపై మూడు చుట్లు విహరించనున్నారు.
రెండో రోజు ఐదు చుట్లు విహరించనున్నారు. ఇక చివరి రోజు అంటే 12వ తేదీ సాయంత్రం శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి భూదేవి, శ్రీదేవి సమేతుడై తెప్పలపై ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ తెప్పోత్సవాలకు భక్తులు సైతం పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. దీని కోసం ఆలయ అధికారులు సైతం ముందుగానే అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం భక్తి సంగీత కచేరి, హరికథాగానం, కోలాటాలు నిర్వహించనున్నారు.
