Site icon Bhakthi TV

శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు. రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్ సైతం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న‌ చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి సాంప్ర‌దాయబ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గ‌వ‌ర్న‌ర్‌కు అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు, టీటీడీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి ధ్వజస్తంభం, గరుడ ఆళ్వార్ వద్ద నమస్కరించి, శ్రీవారి సన్నిధికి చేరారు. స్వామివారి దర్శనం అనంతరం సన్నిధిలో అర్చన, హారతి, తీర్థాలు అందించారు. వీరికి టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోలు శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాలను అందించారు.

Share this post with your friends
Exit mobile version