
మహాభారతంలో భీష్ముని గురించి తెలియని వారుండరు. తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్నవాడు భీష్ముడు. ఆయన 58 రోజుల పాటు అంపశయ్యపై ఉండి ప్రాణ త్యాగం చేసిన రోజే భీష్మాష్టమి. ప్రతి ఒక్కరూ భీష్మ ప్రతిజ్ఞ అనే పదాన్ని ఏదో ఒక సందర్భంలో వాడుతూ ఉంటారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. శంతన మహారాజు, గంగాదేవి పుత్రుడైన భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందాడు. తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన మహానుభావుడు. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడి ఓడిపోయాడు. కానీ మరణం ఆయన దరి చేరలేదు. అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ ఉన్నాడు.
మాఘ మాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు. దక్షిణాయనంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. కానీ ఆయనకు దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి మనస్కరించలేదు. అందుకే ఉత్తరాయణం వచ్చే వరకూ 58 రోజుల పాటు అంపశయ్యపైనే కాలం గడిపాడు. ఐదు రోజుల పాటు తన పంచ ప్రాణాలను ఒక్కొక్కటిగా మాఘ శుక్ల సప్తమి నుంచి విడిచిపెట్టాడు. చివరకు మాఘ శుక్లపక్ష అష్టమి రోజున నిర్వాణం చెందాడు. అందుకే ఆ రోజును భీష్మాష్టమిగా జరుపుకుంటున్నాం. వ్యాసమహర్షి రచించిన పద్మ పురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించిన వివరణ ఉంది.
