Site icon Bhakthi TV

భక్త జన సందోహం నడుమ కన్నుల పండువగా భద్రాద్రి రామయ్య కల్యాణం

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సిరికల్యాణపు బొట్టుతో.. మణిబాసికాలతో.. పాదాలకు పారాణితో పెళ్లికూతురుగా సీతమ్మవారు.. సొంపుగ కస్తూరి నామము నుదుటున దిద్దుకుని.. పట్టు బట్టల్లో అందంగా ముస్తాబైన రాములవారు.. మిథిలా స్టేడియానికి తరలివచ్చారు. భక్త జన సందోహం నడుమ.. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, సుగంధ ద్రవ్యాల పరిమళాలు, వింజామర సేవలు, పన్నీటి చిలకరింపులతో దశరథ తనయుని వివాహం కన్నుల పండువగా జరిగింది. రామయ్య కల్యాణాన్ని తిలకించి అశేష భక్తజనం ఆనందపరవశమైంది.

చలువ పందిళ్లు, చాందినీల అలంకారాలు, కర్పూర కళికల పరిమళాల నడుమ రామయ్య కల్యాణాన్ని కన్నులంతా వీక్షించారు. ప్రతి ఏటా జరిగేదే.. అయినా కూడా.. రామయ్య కల్యాణం చూడచక్కని దృశ్యమే. రామయ్య కల్యాణానికి ప్రతి తెలుగు లోగిల్లూ కల్యాణ శోభతో కళకళలాడుతుంది. భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని కన్నులారా వీక్షించి ముత్యాల తలంబ్రాలను తమతో తెచ్చుకోవాలని భక్తులంతా ఆశపడతారు. అందుకే వేసవి ఎండను సైతం లెక్కచేయక భద్రాద్రికి పయనమవుతారు. ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ఆ పెళ్లివేడుక జగదానందకారకం, జయకరం, శుభకరం, సకల సన్మంగళదాయకం.

Share this post with your friends
Exit mobile version