Site icon Bhakthi TV

19 నుంచి కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు అంటే ఈ నెల 21వ తేదీ వరకూ వైభ‌వంగా జరుగనున్నాయి. వసంతోత్సవాల కోసం ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా చూస్తున్నారు. ఇక వసంతోత్సవాల్లో స్వామివారికి పలు సేవలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటల వరకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లను ఘనంగా ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ధార్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version