Site icon Bhakthi TV

7 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 07 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం.

జూన్ 07వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. తెప్పోత్సవాల్లో భాగంగా జూన్ 07వ తేదీ రాత్రి 7.30 – 8.30 గం.ల మధ్య శ్రీకృష్ణ స్వామివారు, జూన్ 08వ తేదీన శ్రీ సుందరరాజస్వామి వారు, జూన్ 09వ తేదీన శ్రీ పద్మావతీ అమ్మవారు నాలుగు మాడ వీధులలో విహరించనున్నారు. జూన్ 10వ తేదీ రాత్రి 8.30 – 10.00 గం.ల మధ్య గజ వాహనంపై, 11 తేదీ రాత్రి 8.30 – 10.00 గం.ల వరకు గరుడ వాహనంపై అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు. జూన్ 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.

Share this post with your friends
Exit mobile version