Site icon Bhakthi TV

శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాదికోసారి విశేష అభిషేకం…

శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్నాం కదా. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణభట్టర్ శ్రీ స్వామినాథ గురుకుల్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 26న శివరాత్రి పర్వదినం విశేషంగా జరుగనుందని చెప్పారు. ఫిబ్ర‌వ‌రి 27న కల్యాణోత్సవం, ఫిబ్ర‌వ‌రి 28న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి (శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి), శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

Share this post with your friends
Exit mobile version