Site icon Bhakthi TV

దేవతలకు ఆహ్వానం పలకడమే అంకురార్పణ..

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం అంకురార్ఫణ కార్యక్రమం జరుగనుందని తెలుసుకున్నాం. అంకురార్పణ కార్యక్రమం జరగడానికి ముందు, అంటే అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలికి దానిపై బ్రహ్మ పీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత దేవతలను ఆహ్వానించే కార్యక్రమం చేపడతారు. అగ్నిహోత్రం ద్వారా దేవతలను ఆహ్వానిస్తారు. ఆపై భూమాతను ప్రార్థించి పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు.

పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అక్కడితో విత్తనాలను నాటే కార్యక్రమం పూర్తవుతుంది. ఇక తరువాతి రోజు నుంచి ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ సాగుతుంది. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా ఇవాళ సాయంత్రం ఉత్సవర్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఉత్సవర్లైన సేనాధిపతి వారిని తిరుచానూరు, పద్మావతి అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధుల్లో ఘనంగా ఊరేగిస్తారు. ఆలయంలో పుణ్యాహవచనం, రక్షా బంధనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది. విశ్వక్సేనుల ఊరేగింపు ప్రదేశమంతా పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాట్లు చేస్తారు.

Share this post with your friends
Exit mobile version