
గుజరాత్‌లోని ద్వారక నగరంలో చాలా కన్నయ్య ఆలయాలున్నాయి. వాటిలో అత్యంత పురాతన హిందూ దేవాలయం ద్వారకాధీశుడి ఆలయం. ఈ ఆలయాన్ని హిందూ మతంలోని నాలుగు ధామాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఆలయానికి అనంత్ అంబానీ తన పుట్టిన రోజు నేపథ్యంలో పాదయాత్ర చేపట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పుట్టినరోజు ఈ నెల 10న తన 30వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. తన పుట్టినరోజునాడు ద్వారకాధీశుడి ఆశీస్సులు పొందాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే జామ్‌నగర్ నుంచి ద్వారక వరకూ అంటే మొత్తంగా 140 కి.మీ. మేర పాదయాత్రను చేపట్టారు. పుట్టినరోజు నాటికి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంత్ అంబాని పాదయాత్ర చేపట్టడంతో ఈ ఆలయం వార్తల్లో నిలిచింది. ఈ ఆలయ విశేషాలు తెలుసుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. దాదాపు 2,500 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందట. శ్రీకృష్ణుని మనవడు వజ్రనాభుడు ఈ ఆలయ నిర్మాణం గావించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని అనంతర కాలంలో విస్తరించడం జరిగింది. ఈ ఆలయ శిఖరం 78.3 మీటర్ల ఎత్తు.. ఐదు అంతస్తుల నిర్మాణం.. 72 స్తంభాలు.. శిల్ప కళా వైభవంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆలయ శిఖరంపై ఒక పెద్ద జెండా ఎప్పుడూ రెపరెపలాడుతుంది. ఈ ఆలయాన్ని సున్నపురాయితో నిర్మించారు. అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా.. సహజత్వాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
