Site icon Bhakthi TV

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం 5.30 – 8.00 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలకు గత కొద్ది రోజుల నుంచే ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా.. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోనే సేనాధిపతి ఉత్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు. శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన జూన్ 02న సోమవారం ఉదయం 07.02 – 07.20 గం.లకు మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు.

Share this post with your friends
Exit mobile version