Site icon Bhakthi TV

కాకి, గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దోష నివారణ ఎలా చేయాలంటే..

కాకి, గబ్బిలం ఇంట్లోకి ప్రవేశిస్తే మంచిది కాదని తెలుసుకున్నాం కదా. కాకి ఇంట్లోకి ప్రవేశిస్తే చెడు వార్తలు అందుతాయట. గబ్బిలం ఇంట్లోకి ప్రవేశిస్తే కుటుంబంలో సమస్యలు పెరుగుతాయని చెబుతారు. ఒకవేళ కాకి లేదా గబ్బిలం ఇంట్లోకి ప్రవేశిస్తే కలిగే దోషాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి దోషాలను తొలగించేందుకు కొన్ని మార్గాలను అనుసరించాలని పెద్దలు సూచిస్తారు. మన ఇంట్లోకి గబ్బిలం లేదా కాకి ప్రవేశించినప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గబ్బిలం లేదా కాకి ఇంట్లోకి ప్రవేశించిన తదుపరి రోజు కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు గోమూత్రం, తులసి ఆకులు, కొంచెం మట్టి కలిపిన నీటిని ఉపయోగించడం మంచిది.

అలాగే ఇంటిని సైతం శుభ్రం చేసుకోవాలి. ఇంటి మొత్తం శుభ్రం చేసేందుకు గోమూత్రం, పసుపు, కర్పూరం కలిపిన నీటిని ఉపయోగించి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. అనంతరం ఇంటి మధ్యలో బియ్యం పిండితో నక్షత్ర ఆకారంలో ముగ్గు వేసి దానిపై విస్తరాకును ఉంచి దానిపై సముద్ర ఉప్పును పోయాలి. ఉప్పులో మట్టి ప్రమిదను పెట్టి మూడు వత్తులు వేసి.. దానిలో ఆముదం పోసి దీపాన్ని వెలిగించాలి. దీపం కొండెక్కిన తరువాత విస్తరాకుతో సహా దీపాన్ని తీసుకెళ్లి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వదిలేయాలి. అనంతరం ఆలయానికి వెళ్లి దేవుడికి అభిషేకం చేసి తీర్థాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇల్లంతా చల్లి సంప్రోక్షణ చేసి సాంబ్రాణితో ధూపం వేస్తే చెడు శక్తులు తొలగిపోతాయని నమ్మకం.

Share this post with your friends
Exit mobile version