
రేపు శ్రావణ శుక్రవారం. ఈ క్రమంలోనే మహిళలంతా రేపు వరలక్ష్మి వ్రతం ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పూజకు కావల్సినవన్నీ సమకూర్చుకుంటున్నారు. పూజా వస్తువులతో పాటు పూజానంతరం ముత్తైదువులకు ఇవ్వాల్సిన వాయినానికి కూడా సిద్ధం చేసుకున్నారు. ఇకపోతే వాయినంలో భాగంగా ఆకు, వక్క, పసుపు, కుంకుమతో పాటు తప్పనిసరిగా శనగలను కూడా ఇస్తారు. అసలు వాయినంలోనే కాదు.. ఏదైనా పేరంటంలోనూ తప్పనిసరిగా శనగలు ఇస్తుంటారు. ఎందుకు ఇలా శనగలు ఇవ్వడం? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శనగలకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. శనగ అంకుర స్వరూపంగా ఉండి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహమునకు హేతువు. అందుకు శనగలు నానపోసి ఇస్తారు. తడిపిన శనగలు ఇచ్చారు అనుకోండి లోపల అంకురం ప్రారంభం అయిపోతుంది. అలా అంకురం వచ్చే శనగలు సువాసినీ స్త్రీ పుచ్చుకుంది అంటే -సాక్షాత్తు లక్ష్మీ పుచ్చుకున్నట్లే. అపారమయిన ఐశ్వర్యమునకు అది హేతువు. శ్రావణ మాసం అంతా లక్ష్మీ తత్త్వం విశేషంగా ప్రకాశిస్తుంది. చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగే కాలం కాబట్టి శనగలు తాంబూలంతో కలిపి సువాసినులందరికీ ఇస్తారు.
