Site icon Bhakthi TV

తనకు పాపభారం పెరిగిపోవడంతో గంగమ్మ ఏం చేసిందంటే..

హంసలదీవి వద్ద కొలువైన రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. గంగానదికి ఎవరైనా పాప ప్రక్షాళన కోసమే వెళుతుంటారు. ఇది అనాదిగా జరుగుతున్న ఆచారం. ఈ క్రమంలోనే ప్రజలంతా వెళ్లి గంగానదిలో స్నానమాచరించి తమ పాపాలను పోగొట్టుకునేవారు. అయితే ఇలా జనాలంతా గంగానదిలో స్నానమాచరిస్తూ తమ పాపాలను పోగొట్టుకునేవారు కానీ గంగమ్మకు పాప భారం పెంచేశారు. దీంతో ఒకరోజు గంగమ్మ తన బాధనంతా విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంది. తన పాప భారం బాగా పెరిగిపోయిందని.. తనకు పాపభారం తగ్గించమని కోరింది.

శ్రీ మహావిష్ణువు గంగాదేవికి పాపభారం తొలగించుకునేందుకు పరిష్కారం సూచించాడు. గంగానదితో శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడంటే.. పాపాలకు ప్రతి రూపం నలుపు రంగు కాబట్టి నల్లని రంగులో ఉండే కాకి రూపాన్ని ధరించి భూమిపై ఉన్న తీర్థాలన్నింటిలో స్నానమాచరించమని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా ఏ పుణ్యతీర్థంలో స్నానమాచరిస్తే గంగమ్మకు నలుపు రంగు పోయి తెలుపు రంగు వస్తుందో అప్పుడే ఆమెకు పాపాల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే గంగమ్మ అన్ని పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తూ హంసలదీవికి వచ్చింది. అక్కడ స్నానం చేసిన వెంటనే ఆమెకు నలుపు రంగు పోయి తెల్లని హంసలా మారిపోయిందట. అందుకే ఈ ప్రాంతానికి హంసలదీవిగా పేరు వచ్చింది.

Share this post with your friends
Exit mobile version