ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయం పదవది మాత్రమే కాకుండా.. ప్రత్యేకమైనదని కూడా చెబుతారు. త్రిమూర్తులు వెలిసిన ఈ క్షేత్రంలోని గర్భాలయంలో కొలువుదీరిన జ్యోతిర్లింగం స్వయభువు లింగం. అంతేకాకుండా ఈ జ్యోతిర్లింగం.. సోమనాథ, మహాకాళేశ్వరం తర్వాత అంతటి విశిష్టత కలిగినది. అంతేకాకుండా అంతటి పెద్ద లింగం ఇదేనని చెబుతారు. ఈ ఆలయాన్ని మూడో పేష్వా అయిన బాలాజీ బాజీరావు నిర్మించినట్టు తెలుస్తోంది. నల్లరాతితో సువిశాల ప్రాంగణంలో దీనిని నిర్మించారు.
ఈ ఆలయంలో మరో విశేషం ఉంది. అదేంటంటే నంది. సాధారణంగా ప్రతి శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. కానీ త్రయంబకేశ్వర క్షేత్రంలో మాత్రం పరమేశ్వరునికి ఎదురుగా ఉండడు. నందీశ్వరునికి సైతం ఇక్కడ ప్రత్యేక ఆలయం ఉండటం విశేషం. త్రయంబకేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు ఒక నిబంధనను తప్పక పాటించాల్సిందే. అదేంటంటే.. ముందుగా నందీశ్వరుని దర్శించుకుని.. ఆ తరువాత త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవాలి. ఎత్తుగా నిర్మించిన గుడి ప్రాకారాల నడుమ ఎన్నో చిన్న చిన్న శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. బంగారంతో నిర్మితమైన ప్రాకారంలోని కలశాలు అబ్బురపరుస్తాయి. ఈ ప్రాకార కలశాలకు అప్పట్లో రూ.16 లక్షలు ఖర్చైందట.
