దేశంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఆవంచ గణపతి. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో దేశంలోనే ఎత్తైన గణపతి కొలువుదీరాడు. ఈ గణపతి విగ్రహం 12వ శతాబ్దానికి చెందినదిగా పేర్కొంటారు. ఈ గణపతి క్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఏకశిలా గణేశుడి విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పశ్చిమ చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ క్షేత్రాన్ని భక్తుల అభీష్టాలు నెరవేర్చే క్షేత్రంగా పేర్కొంటూ ఉంటారు. ఇక్కడి క్షేత్రంలోని వినాయకుడి విగ్రహం దాదాపుగా 25, 30 అడుగుల ఎత్తు ఉంటుంది.
ఆవంచ గణపతి.. చూసేందుకు చాలా గంభీరంగా కనిపిస్తాడు. అలాగే కొలువుదీరిన ప్రదేశం కూడా అద్భుతంగా ఉంటుంది. పచ్చటి పొలాల మధ్య వెలిశాడు కాబట్టి ఆ క్షేత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భక్తులు కోరిన కోరికలు ఈ విఘ్నేశ్వరుడు తప్పక నెరవేరుస్తాడని నమ్మకం. దేశంలోని ప్రతి గ్రామంలోనూ వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. అయితే స్వయంభువుగా మాత్రం కొన్ని చోట్ల మాత్రమే స్వామివారు వెలిశాడు. అలాంటి వాటిలో ఆవంచ ఒకటి. ఇక్కడి ఏకశిల వినాయకుడు కొండంత స్వామిగా ఖ్యాతి గడించాడు. ఇక్కడి ఆవంచ గణపతిని గుండు గణపతి అని కూడా పిలుస్తారు.
