
కంబోడియా నేలపై విస్తరించిన ఆంగ్‌కోర్ వాట్ ఒక ఆలయం మాత్రమే కాదు… రాతిలో చెక్కబడిన ఒక పురాణ గ్రంథం.. శిల్పంలో నిలిచిన ఒక సామ్రాజ్య చరిత్ర.. హిందూ విశ్వదర్శనానికి మహత్తర సాక్ష్యం. కాలక్రమంలో కంబోడియాలో బౌద్ధ సంప్రదాయం బలపడింది. ఆంగ్‌కోర్ వాట్ కూడా బౌద్ధ ఆరాధనతో మమేకమైంది. అయితే మారని విషయం ఏమిటంటే.. దాని నిర్మాణ గుండెకాయలో హిందూ భావజాలం, వైష్ణవ సంప్రదాయం, పురాణ శిల్పరూపాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. 15వ శతాబ్దం తరువాత ఆంగ్‌కోర్ రాజకీయ ప్రాధాన్యం తగ్గింది. అనేక ప్రాంతాలను అడవులు కప్పేశాయి. కానీ ఆంగ్‌కోర్ వాట్ పూర్తిగా కనుమరుగుకాలేదు.
స్థానిక ప్రజలు, బౌద్ధ సన్యాసులు దానితో సంబంధాన్ని కొనసాగించారు. 19వ శతాబ్దంలో యూరోపియన్ రచయితలు, అన్వేషకుల వర్ణనలు దాని వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రసిద్ధిచేశాయి. నేడు ఆంగ్‌కోర్ వాట్ కంబోడియా జాతీయ చిహ్నం. ఆ దేశ జాతీయ జెండాపైనే ఈ ఆలయ ప్రతిరూపం దర్శనమిస్తుంది. 1992లో ఆంగ్‌కోర్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది మనకు గుర్తు చేసే గొప్ప విషయం ఒక్కటే హిందూ సంస్కృతి భారతదేశపు భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే పరిమితం కాలేదు. ఆగ్నేయాసియాలోని రాజ్యాలు, దేవాలయాలు, శాసనాలు, శిల్పాలు, పురాణ దృశ్యాలు.. మన ధార్మిక భావజాలం అక్కడి స్థానిక సంస్కృతులతో కలసి ఎంత గొప్ప నాగరిక వైభవాన్ని సృష్టించిందో చెప్పుతున్నాయి. రాజులు మారిపోయారు. సామ్రాజ్యాలు కనుమరుగయ్యాయి. కానీ రాతిలో చెక్కిన ధర్మచిహ్నాలు ఇంకా నిలిచే ఉన్నాయి.
