రావణాసురుడి సోదరుల్లో ఒకడైన అహిరావణుడిని సంహరించేందుకు ఆంజనేయుడు పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు. ఆ రూపంతోనే ఆకాశాన్ని తాకుతున్నాడా అని భ్రమింపజేసేలా ఆంజనేయుడు కర్ణాటకలో మనకు దర్శనమిస్తాడు. తూమ్కూరు జిల్లాలోని బిదనగెరెలో 161 అడుగుల ఎత్తులో పంచముఖ ఆంజనేయుడు కొలువుదీరాడు. స్థానికంగా ఉండే బసవేశ్వర మఠానికి దగ్గరలోనే ఈ ఆంజనేయుడి ఆలయం ఉంటుంది. ఈ గుడి పైన ఉన్న స్వామి విగ్రహం పసిడివర్ణంలో ఊరంతా కనిపిస్తూ ఉంటుంది. దేశంలోనే అత్యున్నత ఎత్తైన హనుమంతుడి విగ్రహాల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తారు.
అప్పులిచ్చే అవతారమూర్తి :
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాత్లాం జిల్లా, బిబడోడ్ గ్రామంలో అప్పులిచ్చే హనుమంతుడు కొలువుదీరాడు. ఇక్కడి హనుమంతుడి ఆలయాన్ని స్థానికులంతా కలిసి నిర్మించుకున్న మీదట.. ఓ యాగాన్ని నిర్వహించారు. అప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు చందాల రూపంలో సమకూరిందట. అందులో కొంత నగదును ఆలయ నిర్వాహకులు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి చేబదులుగా ఇచ్చారట. దాన్ని తీసుకున్నవారు చాలా మంచి లాభాలు ఆర్జించారట. సకాలంలో నగదును తిరిగి ఇచ్చేశారట. ఇక్కడ అప్పు తీసుకుంటే ఎలాంటి పని అయినా కూడా సత్ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. దీంతో పేదలే కాకుండా ధనికులు సైతం తమ పెట్టుబడి కోసం ఇక్కడి నుంచే వడ్డీకి డబ్బు తీసుకోవడం ఆరంభించారు. అలా వచ్చిన వడ్డీని ఆలయ నిర్వహణకు, అభివృద్ధికి వినియోగిస్తున్నారు.
