కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన ఏడు కొండలపై కొలువుదీరాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలను భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక స్వామివారికి దిగువన అండే కొండ కింద శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు వెలిసింది. తిరుచానూరులో కొలువుదీరిన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అసలు తిరుచానూరు అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. తిరుపతి జిల్లా కేంద్రమైన తిరుపతి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచానూరులో అమ్మవారి ఆలయం పచ్చని ప్రకృతి రమణీయతల మధ్య ఉంటుంది.
తిరుమల యాత్రా ఫలం అనేది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటే తప్ప లభించదని చెబుతారు. తిరుచానూరు అనేది శ్రీ పద్మావతి అమ్మవారి పుట్టినిల్లుగా చెబుతారు. దీనినే ‘అలమేలు మంగాపురం’ అని కూడా పిలుస్తారు. శ్రీనివాసుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగమ్మ ఇక్కడ కొలువై ఉంటుంది కాబట్టి దీనిని అలమేలు మంగాపురమని.. శ్రీనివాస మంగాపురమని పిలుస్తారు. తిరుమల శ్రీ మలయప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగా తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీదటే తిరుమలకు వెళతారు. అలా వెళితేనే యాత్రా ఫలం దక్కుతుందని చాలా మంది నమ్మకం.

