గోవా రాష్ట్రంలోని మార్సిలే గ్రామంలో వెలసిన ఈ అరుదైన శ్రీకృష్ణ మందిరం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. సాధారణంగా కృష్ణుడిని గోపాలుడిగా, రాసలీలలలో లేదా వెన్నదొంగగా చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం తల్లి దేవకీ ఒడిలో కత్తి ధరించిన బాలకృష్ణుని దర్శించవచ్చు. కంసుడి వలన తన తల్లి దేవకికి దూరమైన శ్రీకృష్ణుడిని, కొన్ని ఏళ్ళ తర్వాత కలిసిన దేవకీ, చిన్నపిల్లాడిలా ఉన్న కన్నయ్యను గుర్తుతెచ్చుకుంది. అది గమనించిన కన్నయ్య చిన్ని కృష్ణుడిలా తన తల్లికి కనిపించాడు. ప్రేమతో బాలకృష్ణుడిని దేవకీ తన ఒడిలోకి తీసుకుంది. ఆ మాతృప్రేమతో నిండిన క్షణాన్నే మార్సిలే ఆలయ విగ్రహం సజీవంగా ప్రతిబింబిస్తుంది. గుజరాతీ శైలిలో అలంకరించబడిన ఈ విగ్రహం అత్యంత అరుదైనదిగా భావిస్తారు. ప్రకృతి సౌందర్యం నడుమ వెలసిన ఈ ఆలయాన్ని దర్శించినవారి పాపాలు తొలగి, మనసుకు శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

