తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రమే కుండలేశ్వర స్వామి ఆలయం. ఇది వృద్ధ గౌతమి తీరాన ఉంది. స్కంద పురాణంలో వివరించిన ప్రకారం కాశీ యాత్రకు వెళ్లేవారు ముందుగా వృద్ధ గౌతమిలో స్నానం చేసి కుండలేశ్వరుని దర్శించుకున్న మీదటే అక్కడి వారంతా కాశీకి బయలుదేరుతారని చెబుతారు. ఈ క్షేత్రం అంతటి ప్రశస్తమైనది కాబట్టే దీనిని దక్షిణ కాశీగా వ్యవహరిస్తున్నారు. శివుని ఆజ్ఞ మేరకు వ్యాస మహర్షి.. కాశీని విడిచి పెట్టాల్సి వచ్చిందట. అయితే విశ్వేశ్వరుని దర్శించుకోలేని తన దురవస్థకు చింతిస్తూ ఆ దుఃఖోపశమనం కోసం అనేక దివ్యధామాలు దర్శించుకుంటున్నాడు.
ఆ సమయంలోనే వ్యాస మహర్షి ఈ కుండలేశ్వర ఆలయానికి సైతం వచ్చాడని చెబుతారు. దక్ష యజ్ఞం తరువాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవి కుండలం ఈ క్షేత్రంలో పడిందని చెబుతారు. ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించిన తరువాత వ్యాసుడు కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతిని పొందాడట. ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి నదికి వ్యాసుల వారు ఒక అద్భుతమైన వరం ప్రసాదించాడని చెబుతారు. అదేంటంటే.. భారతదేశంలో ప్రవహించే ఏ నదికి అయినా పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. కానీ ఈ వృద్ధ గౌతమి నదికి మాత్రం నిత్యం పుష్కరాలు వస్తాయని వరాన్ని వ్యాస మహర్షి ప్రసాదించాడట. కాబట్టి ఈ గోదావరి నదిలో స్నానం చేసిన వారికి పుష్కర స్నానం చేసిన ఫలితం లభిస్తుందట.
