తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఓ కాలభైరవుడి ఆలయం ఉంది. ఇక్కడ కాలభైరవుడు అత్యంత మహిమాన్వితుడని చెబుతారు. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. దీనిని సుమారు 11 వ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు. ఈ ఆలయ విశేషం ఏంటంటే.. దక్షిణ భారతదేశంలోనే గ్రహ పీడలు తొలగించే ఏకైక కాలభైరవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి గాంచింది. గర్భాలయంలో 7 అడుగుల ఎత్తుతో దిగంబరంగా నిలుచుని ఉన్న కాలభైరవస్వామి మనకు దర్శనమిస్తాడు. ఈ స్వామివారిని దర్శించుకుంటే.. సకల గ్రహ పీడలు తొలగిపోతాయని నమ్మకం.
శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో భైరవసెల పేరిట కాలభైరవ ఆలయం ఉంది. ఈ ఆలయం సహజ సిద్ధమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. ఇదే గుహలో ఒక శివలింగంతో పాటు స్థానిక చెంచుల దేవుడైన నిరాకార బయన్న కూడా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ కాలభైరవ ఆలయాలున్నాయి. విశాఖపట్నం జిల్లా అడవివరంలో, ఒంగోలు జిల్లాలోని భైరవకోనలో కాలభైరవ ఆలయాలున్నాయి. అలాగే నేపాల్ రాజధాని ఖాట్మండులో కూడా కాలభైరవస్వామికి ఆలయాలున్నాయి.
